పాక్‌ అధ్యక్షుడితో ప్రధాని కరచాలనం.. | Sakshi
Sakshi News home page

పాక్‌ అధ్యక్షుడితో ప్రధాని కరచాలనం..

Published Sun, Jun 10 2018 7:39 PM

 Modi, Mamnoon Hussain shake hands at SCO Summit - Sakshi

బీజింగ్‌ : భారత్‌, పాకిస్తాన్‌ నేతలు ఉమ్మడి వేదికను పంచుకున్న ప్రతిసారీ వారి కదలికలపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమవుతుంది. ఆదివారం నాటి షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) భేటీలోనూ ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్‌ అధ్యక్షుడు మమ్నూన్‌ హుస్సేన్‌ల మధ్య చోటుచేసుకున్న మర్యాదపూర్వక సందర్భం అందరినీ ఆకర్షించింది. ఎస్‌సీఓ సదస్సు నేపథ్యంలో క్వింగ్డాలో మీడియా సమావేశానంతరం మోదీ, హుస్సేన్‌లు కరచాలనం చేసుకున్నారు.

భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఇరువురి నేతల మధ్య కరచాలనం ఉత్కంఠ వాతావరణాన్ని తేలికపరిచినా సమస్యలపై లోతైన చర్చల పట్ల మాత్రం సందేహాలు అలాగే ఉన్నాయి. 2016లో యూరి సైనిక శిబిరంపై దాడి అనంతరం భారత్‌, పాకిస్తాన్‌ సంబంధాలు బెడిసికొట్టాయి. ఈ దాడికి నిరసనగా భారత్‌ 19వ సార్క్‌ సదస్సునూ బహిష్కరించింది. భారత్‌ నిర్ణయంతో బంగ్లాదేశ్‌, భూటాన్‌, ఆప్ఘనిస్తాన్‌లు సైతం ఇస్లామాబాద్‌లో జరిగే భేటీకి దూరమవుతామని ప్రకటించడంతో సదస్సు రద్దయింది. మరోవైపు జమ్మూ కశ్మీర్‌లోని పాకిస్తాన్‌ సరిహద్దుల్లో కాల్పులు, ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement